రివ్యూ: ‘హనుమాన్’

Movie Review
రివ్యూ: ‘హనుమాన్’

HanuMan Official Trailer - Telugu | Prasanth Varma | Teja Sajja | Primeshow Entertainment

Our Rating

3
out of 5

కథ: సౌరాష్ట్రలో సూపర్ హీరో అయ్యేందుకు మైఖేల్(వినయ్ రాయ్) చిన్నప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తుంటాడు. అతడు ఎలాంటి వాడంటే తన ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. పవర్స్ కోసం మైఖేల్ చేసే ప్రయోగాలన్నీ విఫలం అవుతాయి. చివరకు తనను సూపర్ హీరోను చేసే పవర్ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. మరో వైపు అంజనాద్రి అనే మారుమూల ప్రాంతంలో పాలెగాడు గజపతి(దీపక్ శెట్టి) గ్రామంపై తన ఆధిపత్యం చెలాయిస్తూ అకృత్యాలకు పాల్పడుతూ ఉంటాడు. తనను ఎదురించిన వారిని చంపేస్తూ ఉంటాడు. అదే ఊరిలో హనుమంతు (తేజ సజ్జ) చిల్లర దొంగతనాలు చేస్తూ తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు లేని హనుమంతును అతడి సోదరి అంజమ్మ (వరలక్ష్మి శరత్‌కుమార్) పెంచి పెద్దచేస్తుంది. హనుమంతుకి మీనాక్షి (అమృత అయ్యర్) అంటే చాలా ఇష్టం. అయితే ఓ రోజు మీనాక్షి గజపతికి ఎదురు తిరగడంతో ఆమెపై దాడి చేయిస్తాడు. మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో గాయపడ్డ హనుమంతుకు ఆంజనేయస్వామి రక్తబింధువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. ఆ మణి వల్ల హనుమంతుకు అపారమైన శక్తులు లభిస్తాయి. ఆ శక్తులతో హనుమంతు ఏం చేశాడు? ఈ మణి గురించి మైఖేల్ కు ఎలా తెలిసింది? మైఖేల్ నుంచి హనుమంతు తన గ్రామాన్నిఎలా కాపాడారు, హనుమంతుకు వీబీషణుడు(సముద్రఖని) ఏ విధగా సహాయపడ్డారు అనేది తర్వాతి కథ.

సినిమా ఎలా ఉందంటే... ఒక సామాన్యుడికి సూపర్ వపర్స్ అందితే, అతడు ఆ పవర్స్ ఉపయోగించి చేసే విన్యాసాలు ఆకట్టుకునే విధంగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. తేజ సజ్జ సూపర్ పవర్స్ అందుకున్న క్షణం నుండి, సినిమా మరింత వినోదాత్మకంగా మారుతుంది. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ బాగా డిజైన్ చేశారు. VFX వర్క్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. హనుమంతు.. హనుమాన్‌ గా మారిన తర్వాత కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో హనుమంతుడిని ఎలివేట్ చేసే సన్నివేశాలను ప్రశాంత్ వర్మ రూపొందించిన తీరును ప్రేక్షకులు ఇష్టపడతారు.

ఇది మనం ఇప్పటికే చాలా సినిమాల్లో ఒక చెడ్డ వ్యక్తి సూపర్ పవర్స్ పొందడం ద్వారా ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించడం అందరికీ తెలిసిన కథాంశమే. అయితే ప్రశాంత్ వర్మ కథనాన్ని నడిపించిన తీరు, కథకు నేపథ్యాలను జోడించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే... హనుమంతు అనే ఒక చిల్లర దొంగ పాత్రలో తేజ సజ్జ, శక్తులు వచ్చాక హనుమాన్ గా అతడు తన పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. మీనాక్షి పాత్రలో అమృత అందంగా కనిపించింది. సెకండాఫ్ లో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి రోల్ ఆకట్టుకుంది. వినయ్ రాయ్ విల్ పాత్రలో స్టైలిష్ గా కనిపించడంతో పాటు నటనతో ఆకట్టుకున్నాడు. విబీషణుడి పాత్రలో సముద్రఖని పాత్ర గుర్తుండి పోతుంది. ఇతర నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ & మైనస్ పాయింట్స్

కథ మామూలుగా ఉన్నప్పటికీ కథనం, ఎంచుకున్న నేపథ్యాలు కొత్తగా ఉన్నాయి

తేజ సజ్జ నటన ఆకట్టుకుంటుంది.

విఎఫ్ఎక్స్ ఓకే అనే విధంగా ఉన్నాయి.

బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి

ఫస్ట్ హాఫ్‌లో వచ్చే నైట్ సీక్వెన్స్‌లో క్లారిటీ లేదు

చివరగా...

హనుమాన్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంక్రాంతికి ఇది ఫ్యామిలీతో చూసే మంచి వినోదాత్మక చిత్రం అవుతుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ సూపర్ హీరో మూవీల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.

దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

నిర్మాత: నిరంజన్ రెడ్డి

సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్

తారాగణం: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య

Related Reviews

Related News